Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నిధులు ఇవ్వకుంటే మునుగోడులో కురుక్షేత్రమే.. సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 06:10 PM |
నిధులు ఇవ్వకుంటే మునుగోడులో కురుక్షేత్రమే.. సీఎం రేవంత్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనతో ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కాలం కలిసి వచ్చిందని, మిగిలిన రెండేళ్ల పాలనలో అందరినీ సమానంగా చూస్తూ రాష్ట్ర ప్రజలకు తండ్రి పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించడంతో పాటు, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను వెంటనే రూ.5 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలేనా అని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. మునుగోడు నిధులను అడ్డుకుంటే మరో చరిత్ర సృష్టిస్తానని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలోనే మౌలిక సదుపాయాల సమస్యలు ఉన్నాయని, అలాంటప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. ఉన్న సిటీకే దిక్కులేని పరిస్థితి ఉందంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 'నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష.. పండబెట్టి తొక్కుతా అనడం ఏంటి?' అంటూ నిలదీశారు.

రైతు బంధు పథకం విషయంలోనూ ఆయన పలు సూచనలు చేశారు. నిజంగా వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా అందించాలని, హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి కాకుండా సాగు చేస్తున్న రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షంలోనే ఉండాల్సిన అవసరం లేదని, అధికార పార్టీలో ఉంటూనే ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, ఆ అక్రమాలను వెలికితీసి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన అందించారని గుర్తుచేసిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. తనకు పదవులపై ఆశ లేదని, పదవుల కోసం ఎవరి ఇంటి చుట్టూ తిరిగే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నది తమ ఆకాంక్ష అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.