Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 18 Nov 2026, 06:08 PM |
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలి

సాయి గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం

సూర్యాపేట, నవంబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, ఈ దశలోనే మంచి అలవాట్లను అలవర్చుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసన్న కుమార్ మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి, చెడులను గుర్తించి సరైన మార్గంలో నడవాలని, చెడు అలవాట్లకు బానిసలై విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులు, తోటి విద్యార్థులకు కూడా వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని కోరారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎవరైనా మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. షీ టీమ్స్, స్థానిక పోలీసులు మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నారని వివరించారు.

ఇవి కూడా చదవండి

సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయకూడదని, అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువతను శారీరకంగా, మానసికంగా బలహీనపరచడమే కాకుండా వారి జీవిత లక్ష్యాలను దెబ్బతీస్తుందని అన్నారు. యువత దేశానికి విలువైన సంపద అని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా తోటి విద్యార్థులతో గౌరవంగా, స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. కళాశాలల్లో లేదా బయట ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, నేరాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం సీఐ, షీ టీమ్స్ ఎస్‌ఐ పాల్గొని సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ భద్రతకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార భద్రతపై వివరించారు. విద్యార్థులు పోలీస్ శాఖ సూచనలను పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, నేరరహిత, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.