Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 17 Nov 2026, 08:11 AM |
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలి

సూర్యాపేట, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను విజయవంతం చేయాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సందడి నెలకొనేలా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, యువజనాభివృద్ధి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 20 వేదికలపై వివిధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ప్రతిష్ఠాత్మకమని, ఈ క్రీడా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో, మస్కట్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. క్రీడా పోటీలు జరిగే జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించి లక్షలాది మంది ప్రజలు, విద్యార్థులు, యువత ఈ క్రీడలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ తెలంగాణలోని 33 జిల్లాల్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, పార్కులు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అధికారిక లోగో, మస్కట్‌తో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్లలో కౌంట్‌డౌన్ బోర్డులు, ప్రధాన కూడళ్లలో మస్కట్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి ప్రజల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి