Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శబరిమల ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేటకు అన్యాయం?.. ఉమ్మడి వరంగల్ అయ్యప్ప భక్తుల ఆవేదన!

Author
Posted By Marelli kiran
| 15 Nov 2026, 10:31 PM |
శబరిమల ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేటకు అన్యాయం?.. ఉమ్మడి వరంగల్ అయ్యప్ప భక్తుల ఆవేదన!

హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించిన ప్రత్యేక రైళ్ల కేటాయింపుపై ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్ల కేటాయింపులో కాజీపేట రైల్వే జంక్షన్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం నల్గొండ మార్గానికి 48 ట్రిప్పులు కేటాయించగా, అత్యంత రద్దీగా ఉండే కాజీపేట–ఖమ్మం మార్గానికి కేవలం 6 ట్రిప్పులు మాత్రమే కేటాయించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు తరలివెళ్తుంటారని, అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం సాధారణ రైళ్లలోనే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉందని, రెండు నెలల ముందుగానే టికెట్లకు రిగ్రెట్ బోర్డులు, భారీ వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. దీంతో అయ్యప్ప స్వాములు, వారి కుటుంబ సభ్యులు, వృద్ధులు, చిన్నారులు రైలు ప్రయాణానికి టికెట్లు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించాలని భక్తులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి శబరిమలకు వెళ్లే యాత్రికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని కాజీపేట జంక్షన్ మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.