Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ స్థలంలో ప్రైవేటు పెత్తనం.. వీధి వ్యాపారులపై వేధింపులు!

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 06:37 PM |
మున్సిపల్ స్థలంలో ప్రైవేటు పెత్తనం.. వీధి వ్యాపారులపై వేధింపులు!

• నెలకు రూ.1,500 ఇవ్వాలంటూ బెదిరింపులు.
• కూరగాయలు నేలపాలు చేశారని వ్యాపారుల ఆరోపణ
• దౌర్జన్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు: మున్సిపల్ కమిషనర్ నాగరాజు

నేరేడుచర్ల, నవంబర్ 14 (ప్రజానేస్తం/జ్వాల):నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జాన్‌పహాడ్ రోడ్డులో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలంగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధి వ్యాపారులపై ఓ ప్రైవేటు వ్యక్తి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే ఒక్కొక్కరు నెలకు రూ.1,500 చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారాలు చేసుకోనివ్వబోమని బెదిరిస్తున్నారని బాధిత వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

నెలవారీ డబ్బుల కోసం ఒత్తిళ్లు?
పాలకీడు మండలం చెరువు తండాకు చెందిన నాగు నాయక్ అనే వ్యక్తి గత రెండు వారాలుగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారులు తెలిపారు. మార్కెట్ స్థలం తనదంటూ వ్యాపారుల నుంచి నెలవారీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వ్యాపారం చేసుకునే విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూరగాయలు నేలపాలు చేశారని ఆరోపణ
వ్యాపారం చేసుకునేందుకు తీసుకొచ్చిన కూరగాయలను కింద పడేసి నష్టపరిచారని వ్యాపారులు గుంజ సతీష్, ఉప్పెల్లి స్వప్న, బొల్లా శ్రీను ఆరోపించారు. రోజువారీ వ్యాపారంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న తమపై ఈ విధమైన ఒత్తిళ్లు తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కోర్టు పరిధిలో స్థల వివాదం
గత ప్రభుత్వ హయాంలో సుమారు 1.20 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ స్థలం గతంలో ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిగా స్థానికంగా ప్రచారంలో ఉంది. అయితే, స్థలం ప్రైవేటు వ్యక్తులకు చెందినదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. స్థలానికి సంబంధించిన అసలు యాజమాన్య హక్కులపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

కలెక్టర్ బంధువులున్నారంటూ వ్యాఖ్యలు?
ఈ ఆరోపణలపై వివరణ కోరేందుకు నాగు నాయక్‌ను ఫోన్‌లో సంప్రదించగా, తనకు కలెక్టర్ బంధువులు ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని మాట్లాడినట్లు రిపోర్టర్ తెలిపారు. అంతేకాకుండా, ఇతర వ్యక్తుల వద్ద నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పినట్లు వెల్లడించారు. అయితే, ఈ వాదనలకు సంబంధించి సంబంధిత పత్రాలు, స్థల హక్కులపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది.

దౌర్జన్యానికి పాల్పడితే చర్యలు: కమిషనర్
ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ చి. నాగరాజును వివరణ కోరగా, సదరు స్థలం కోర్టు వివాదంలో ఉందని తెలిపారు. వీధి వ్యాపారులపై ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలి
కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం, వీధి వ్యాపారుల నుంచి నెలవారీ డబ్బుల డిమాండ్, కూరగాయలను నేలపాలు చేశారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. స్థల యాజమాన్యంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, చిరు వ్యాపారులకు భద్రత కల్పించి వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.