Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తీన్మార్ మల్లన్నకు ప్రాణహాని కలిగించే కుట్రలను సహించేది లేదు

Author
Posted By Nagaraju Golla
| 13 Nov 2026, 07:16 PM |
తీన్మార్ మల్లన్నకు ప్రాణహాని కలిగించే కుట్రలను సహించేది లేదు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపడుతున్న బీసీ రాజ్యాధికార పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు రాజకీయ శక్తులు ఆయనపై దాడులకు కుట్రలు చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. నేటి పాదయాత్ర సందర్భంగా తీన్మార్ మల్లన్న ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనాన్ని లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నం జరిగిందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలో బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడు, ఎర్ర సత్యం వంటి పలువురు ఉద్యమకారులు సామాజిక న్యాయం, తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలను ఈ సందర్భంగా రవి పటేల్ గుర్తుచేశారు. ప్రస్తుతం బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్నకు కూడా ముప్పు పొంచి ఉందనే అనుమానాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. 51 రోజులుగా నిర్విరామంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ బీసీల విద్య, వైద్యం, ఉద్యోగాలు, రాజకీయ వాటా, సామాజిక న్యాయం కోసం మల్లన్న పోరాడుతున్నారని తెలిపారు. బెదిరింపులతో ఈ ఉద్యమాన్ని ఆపలేరని, ఇప్పటికే ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని రవి పటేల్ పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తు కోసం విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ అధికారంలో తగిన వాటా సాధించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని కోరారు. ఈ ఘటనను తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండించాలని, రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ డీజీపీ తక్షణమే స్పందించి తీన్మార్ మల్లన్నకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని, ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

తీన్మార్ మల్లన్నకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవి పటేల్ హెచ్చరించారు. బీసీ రాజ్యాధికార ఉద్యమాన్ని బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వాహనాన్ని ఢీకొట్టే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో మరో భారీ బీసీ ఉద్యమానికి ఈ ఘటన కారణం కాకముందే ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని, బీసీ రాజ్యాధికార సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, అధికార ప్రతినిధి మడే సంతోష్, కోశాధికారి జినుకల శ్రీను, జిల్లా కోఆర్డినేటర్ మోటపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు జిలకల అశోక్, గట్టు శ్రీకాంత్, రోడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.