Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేటలో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!

Author
Posted By Praja Nestham Jwala News
| 13 Nov 2026, 06:31 PM |
సూర్యాపేటలో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్!

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా.. ఇన్నోవాలో 112 కిలోల గంజాయి స్వాధీనం

పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఎస్కార్ట్‌గా మరో కారు.. పరారీలో ముగ్గురు నిందితులు

సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టు చేశారు. జాతీయ రహదారి 65పై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఇన్నోవా కారును తనిఖీ చేయగా 112 కిలోల గంజాయి బయటపడింది. సుమారు రూ.25 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశాలోని జగన్నాథపురి ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద కిలో రూ.2,000 చొప్పున 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేశారు.

పోలీసుల కళ్లుగప్పేందుకు ఎస్కార్ట్ కారు
గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారు చేసి ఇన్నోవా కారులో నింపి మహారాష్ట్రకు బయలుదేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో ఎర్టిగా కారును ముందుగా ఎస్కార్ట్‌గా నడిపించారు. పోలీసుల కదలికలను గమనిస్తూ వెనుక వస్తున్న ఇన్నోవా వాహనానికి సమాచారం అందించేలా పథకం రూపొందించారు. ఈ క్రమంలో నవంబర్ 7న సూర్యాపేట పట్టణ శివారులోని జాతీయ రహదారి 65పై పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో ఇన్నోవా కారు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ అయింది. దీంతో నిందితులు కారును రహదారి పక్కన వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

వాహనం కోసం తిరిగి వచ్చి పోలీసులకు చిక్కారు
అనుమానాస్పదంగా కారు నిలిపి ఉన్నట్లు సమాచారం అందడంతో సూర్యాపేట రెండో పట్టణ ఎస్సైలు కె. గోపికృష్ణ, బి. రామచంద్రం సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. కారును తనిఖీ చేయగా 41 ప్యాకెట్లలో ఉన్న 112 కిలోల గంజాయి బయటపడింది. పంచుల సమక్షంలో గంజాయితో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు నవంబర్ 12న సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.

అరెస్టయిన నిందితులు వీరే..
1. ఆకాష్ విజయ్ దాబేకర్ (23), బీడ్ జిల్లా, మహారాష్ట్ర.
2. ఆకాష్ దిలీప్ మోరే (32), బుల్దానా జిల్లా, మహారాష్ట్ర.

వీరి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ కె. నరసింహ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యంతో పాటు వారి కుటుంబాలు, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఈ కేసును ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన పట్టణ సీఐ వెంకటయ్య, రెండో పట్టణ ఎస్సైలు కె. గోపికృష్ణ, రామచందర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, కానిస్టేబుళ్లు కొండా రమేష్, ఎన్. నవీన్‌లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ వెంకటయ్య, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.