Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తుఫాన్‌ ముప్పు.. సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్!

Author
Posted By Praja Nestham Jwala News
| 02 Nov 2026, 05:28 PM |
తుఫాన్‌ ముప్పు.. సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్!

📌 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాణాలు నిలిపివేయాలని కలెక్టర్ సూచన

తుఫాన్‌ ముప్పు.. సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్! - Additional Image

గంటకు 80 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.. అధికారులతో కలెక్టర్ అత్యవసర సమీక్ష

సూర్యాపేట, నవంబర్ 2 (ప్రజానేస్తం జ్వాల):

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫాన్‌ ప్రభావం సూర్యాపేట జిల్లాపై పడే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

తుఫాన్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ అత్యవసర వెబెక్స్ సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు!

అధికారుల అంచనాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, అర్ధరాత్రి 55 నుంచి 65 కిలోమీటర్లు, మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సమావేశంలో వివరించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ప్రయాణాలు వద్దు!

తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాల రాకపోకలను వీలైనంత వరకు నిలిపివేయాలని కోరారు.

చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బలహీనమైన నిర్మాణాల వద్ద నిలబడవద్దని హెచ్చరించారు. ఇళ్లలోని కిటికీలు, తలుపులు, రూఫ్ షీట్లు, బయట ఉన్న వదులుగా ఉండే వస్తువులను భద్రపరుచుకోవాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

ఇవి కూడా చదవండి

వరద ముప్పు ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, బలహీనమైన భవనాలను ముందుగానే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెలు, తాత్కాలిక షెడ్లలో నివసించే వారిని సురక్షితమైన పక్కా భవనాలకు తరలించాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

వాగులు, వంకలు, బ్రిడ్జిలు, కాజ్‌వేలపై వరద నీరు ప్రవహిస్తుంటే రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు.

పాఠశాలలకు ముందస్తు ఆదేశాలు

విద్యార్థుల భద్రత దృష్ట్యా సోమవారం మధ్యాహ్న భోజనం అనంతరం పాఠశాలలకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇళ్లకు పంపించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు కూడా ఇళ్లకు వెళ్లాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారం, తాగునీరు, రక్షణ కల్పించాలని ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులు, కాల్వల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రోడ్లపై చెట్లు కూలినా, వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగినా వెంటనే స్పందించేందుకు జేసీబీలు, ఇసుక బస్తాలు, ఇతర అత్యవసర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్

తుఫాన్‌ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కీలక శాఖ నుంచి ఒక అధికారిని 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని, సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి గంటకు పరిస్థితిపై నివేదిక అందించాలని సూచించారు.

ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడితే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేయాలని తెలిపారు. తుఫాన్‌ కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సమీక్షలో పాల్గొన్న అధికారులు

ఈ అత్యవసర సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్వో ప్రేమ్ రాజ్, వెంకటరమణ, డీఈఓ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీనివాసరావు, డీఎస్ఓ మోహన్ బాబు, ఆర్టీఓ పురుషోత్తం రెడ్డి, డీఐఈఓ సులోచన రాణి, ఆడిట్ అధికారి శ్యామ్, డీటీడీఓ, ఇరిగేషన్, ఫైర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.