Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గోపాలపురానికి గ్రామకంఠం కేటాయించాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 29 Oct 2026, 05:56 PM |
గోపాలపురానికి గ్రామకంఠం కేటాయించాలి

  • దశాబ్దాల భూ రికార్డుల సమస్యకు పరిష్కారం చూపాలి.. జిల్లా కలెక్టర్‌కు ఐఎన్‌టీయూసీ నేత గురవయ్య గౌడ్ విజ్ఞప్తి


హుజూర్‌నగర్, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల):

హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామానికి తక్షణమే అధికారికంగా గ్రామకంఠం కేటాయించి, భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేయాలని ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. గ్రామంలోని దేవాదాయ, పట్టా, ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామస్తుల వినతి

ఇవి కూడా చదవండి

గత ఏడాది గోపాలపురం గ్రామస్తులు మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి గ్రామంలోని భూములపై సమగ్ర సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించినట్లు గురవయ్య గౌడ్ తెలిపారు. మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో డివిజన్ సర్వేయర్ గ్రామంలో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సర్వేలో కీలక భూ వివరాల గుర్తింపు

సర్వే వివరాల ప్రకారం గోపాలపురం గ్రామం సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించారని గురవయ్య గౌడ్ తెలిపారు. 238వ సర్వే నంబర్‌లో 1 ఎకరం 17 కుంటల పోరంబోకు పట్టా భూమి, 342వ సర్వే నంబర్‌లో 6 ఎకరాల 13 కుంటల ప్రభుత్వ భూమి, 623వ సర్వే నంబర్‌లో 36 ఎకరాల 26 కుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు సర్వే వివరాల్లో వెల్లడైందని పేర్కొన్నారు.

ఈ మూడు సర్వే నంబర్లకు సంబంధించి తహశీల్దార్, ఆర్డీవో నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు తెలిపారు. అయితే, ఈ భూముల వర్గీకరణ, గ్రామకంఠం కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు.

రికార్డుల సమస్యతో గ్రామస్తులకు ఇబ్బందులు

గ్రామం దశాబ్దాలుగా ఉనికిలో ఉన్నప్పటికీ గ్రామకంఠం, భూ రికార్డులకు సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురవయ్య గౌడ్ పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికే నిర్వహించిన సర్వే ఆధారంగా నివేదికను పరిశీలించి, చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి గ్రామకంఠం కేటాయింపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి భూ రికార్డులను పరిశీలించాలని, అవసరమైన సవరణలు చేపట్టి గోపాలపురం గ్రామస్తులకు న్యాయం చేయాలని బెల్లంకొండ గురవయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.