Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జంగుబాయి ఆలయానికి శాశ్వత రహదారి నిర్మించాలి!

Author
Posted By Praja Nestham Jwala News
| 16 Oct 2026, 11:17 PM |
జంగుబాయి ఆలయానికి శాశ్వత రహదారి నిర్మించాలి!

ఆసిఫాబాద్, అక్టోబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాడావి మనోహర్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోట పారాందోలి మహారాజ్‌గూడలోని రైథడ్ జంగుబాయి దేవస్థానానికి వెళ్లే రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గిరిజన భక్తులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పుణ్యక్షేత్రానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏటా భక్తులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్యమాసం సందర్భంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జంగుబాయి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. ఈ సమయంలో రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలు ప్రయాణంలో అవస్థలు పడుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం పుష్యమాసానికి ముందు రహదారిపై మట్టి పనులు, తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నప్పటికీ అవి కొంతకాలానికే దెబ్బతింటున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా అదే సమస్య పునరావృతమవుతోందని, తాత్కాలిక పనులకే పరిమితం కాకుండా శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే జంగుబాయి దేవస్థానానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రహదారి పరిస్థితిని పరిశీలించాలని, అవసరమైన సర్వే నిర్వహించి నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు మాడావి భరత్ భూషణ్ మాట్లాడుతూ, జంగుబాయి దేవస్థానానికి వచ్చే భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రహదారి సమస్యను ప్రాధాన్యంగా పరిగణించాలని కోరారు. తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.