రాష్ట్రాలకు కేంద్రం దీపావళి కానుక: పన్నుల వాటా నిధులు రూ.1,09,019 కోట్లు ముందస్తు విడుదల!
దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తీపి కబురు అందించింది. సాధారణంగా నవంబర్ 10వ తేదీన విడుదల చేయాల్సిన పన్నుల వాటా నిధులను ఈసారి ముందస్తుగానే విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను మొత్తం రూ.1,09,019 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.2,370 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పండుగ సీజన్లో ముందస్తుగా ఈ అదనపు నిధులు అందడం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుంది.