విజయదశమి వేళ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. స్టేషన్‌లోని ఆయుధాలు, పోలీస్ వాహనాలను శుభ్రపరిచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా విజయదశమి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.