🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:15 pm Posted by : Marelli kiran

రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల జీవిత బీమా.. నవంబర్‌ 19 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం

News Image
హనుమకొండ, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు ప్రక్రియ నవంబర్‌ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రేషన్‌ కార్డు లేదా ఎఫ్‌ఎస్‌సీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుండగా, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

అర్హతలు, నిబంధనలు
కుటుంబంలో బీమా చేయించుకునే సంపాదించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు నిర్ధారణకు ఆధార్‌ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కుటుంబంలో ఒక్కరే సంపాదిస్తుంటే వారి పేరు మీద, ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే కుటుంబ సభ్యులు ఎంపిక చేసిన వ్యక్తి పేరు మీద బీమా నమోదు చేస్తారు.

నామినీల వివరాలు తప్పనిసరి
బీమా పాలసీకి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చు. రూ.5 లక్షల బీమా మొత్తాన్ని నామినీలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్న వివరాలను నమోదు సమయంలోనే తెలియజేయాలి.

గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు
ఈ పథకం కోసం ప్రజలు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నవంబర్‌ 19 నుంచి గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వివరాలు నమోదు చేస్తారు. బీమా చేయించుకునే వ్యక్తి, నామినీల ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు లేదా స్మార్ట్‌ ఎఫ్‌ఎస్‌సీ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, కుటుంబ సభ్యుల వివరాలను వెంట తీసుకెళ్లాలి.

నమోదు వివరాలు పరిశీలించుకోవాలి
అధికారులు నమోదు చేసిన వివరాలను లబ్ధిదారుల ముందే చదివి వినిపిస్తారు. పేరు, వయస్సు, నామినీల వివరాలు, వాటా శాతాలను జాగ్రత్తగా పరిశీలించి, తప్పులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే సంతకం లేదా వేలిముద్ర వేయాలని సూచించారు.

మరణిస్తే 10 రోజుల్లో పరిహారం
బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల పరిహారం అందించేలా ప్రత్యేక క్లెయిమ్‌ ప్రక్రియను రూపొందించినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ద్వారా క్లెయిమ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ద్వారా చర్యలు చేపడతారు. మరణ ధృవీకరణ పత్రం, బీమా నమోదు రసీదు, నామినీ ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ ప్రతులను సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిమ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 రోజుల్లోపు పరిహారం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
🏠 Home