🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 3:24 pm Posted by : Praja Nestham Jwala News

రైస్ మిల్లుల ధూళి కాలుష్యంతో 19వ వార్డు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

News Image
చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం.. కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి

హుజూర్‌నగర్, నవంబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు లింగగిరి రోడ్డులో ఉన్న రెండు రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు కౌన్సిలర్ వల్లపుదాస్ కృష్ణ గౌడ్ తెలిపారు. రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న ధూళి ఇళ్లలోకి చేరడంతో చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, దగ్గు తదితర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇళ్ల పరిసరాలు, వీధులు ధూళితో నిండిపోతున్నాయని, ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌లకు వినతిపత్రం అందజేశారు. రెండు రైస్ మిల్లులను తక్షణమే తనిఖీ చేసి, ధూళి కాలుష్యాన్ని నియంత్రించే పరికరాలు ఏర్పాటు చేయించాలని కోరారు. నిబంధనలు పాటించని మిల్లుల యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్ వల్లపుదాస్ కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు షేక్ సైదా, టీమ్ 19 సభ్యుడు షేక్ మీరా పాషా, 18వ వార్డు కౌన్సిలర్ జక్కుల మల్లయ్య, 1వ వార్డు కౌన్సిలర్ నందిగామ శ్రీను, 28వ వార్డు కౌన్సిలర్ మోదాల సైదులు, చిన్నపంగు ప్రవీణ్, చనగాని సైదులు, 19వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home