🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:40 am Posted by : Marelli kiran

అదనపు భూమిపై రైతులకు యాజమాన్య హక్కులు ఉండవు.. రీ-సర్వేపై రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు!

News Image
హనుమకొండ, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ప్రభుత్వ భూముల రీ-సర్వే నిర్వహణకు సంబంధించి రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. రీ-సర్వే సమయంలో పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదైన విస్తీర్ణం కంటే అదనంగా భూమి ఉన్నట్లు గుర్తిస్తే, ఆ అదనపు భూమిపై సంబంధిత రైతులకు స్వయంచాలకంగా యాజమాన్య హక్కులు లభించవని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

పట్టా రికార్డుల్లో నమోదైన భూమి విస్తీర్ణానికి మించి ఉన్న భూమిని అదనపు భూమిగా పరిగణించి, దానిపై హక్కుల విషయంలో రెవెన్యూ రికార్డులు, సంబంధిత ఆధారాలను పరిశీలించాలని సూచించినట్లు సమాచారం. అదేవిధంగా సర్వేలో గుర్తించిన అదనపు భూమిని అర్హత కలిగి, పట్టా విస్తీర్ణం కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు నిబంధనల ప్రకారం సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా వాటి సరిహద్దులను పక్కాగా గుర్తించి, హద్దులను నిర్ధారించాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. భూముల రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు రైతుల భూ హక్కులకు సంబంధించిన రికార్డులను పక్కాగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
🏠 Home