🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 4:23 pm Posted by : Praja Nestham Jwala News

2,418 మందికి చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ

News Image
వృద్ధాప్య పింఛన్లను కూడా త్వరలో మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, నవంబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' ఆలపించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో కొత్తగా చేయూత పింఛన్లకు ఎంపికైన 2,418 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన 531 మంది, చౌటుప్పల్ మండలానికి చెందిన 970 మంది, నారాయణపూర్ మండలానికి చెందిన 917 మంది ఉన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు పింఛన్లకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు నేడు శుభదినమని అన్నారు. గత పదేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, వేలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. త్వరలోనే వృద్ధాప్య పింఛన్లు కూడా మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సీఈవో శోభారాణి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home