🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 8:16 am Posted by : Praja Nestham Jwala News

చండూరులో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

News Image
చండూరు, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): చండూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి హాజరయ్యారు. అయ్యప్ప దీక్షా వస్త్రధారణలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ చండూరు పట్టణంలో అత్యద్భుతంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. రెండు రోజుల క్రితమే తన వంతుగా ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించానని గుర్తుచేశారు. తాజాగా మరో రూ.10 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

దైవ కార్యక్రమాల్లో రాజకీయాలు, కులమతాలకు తావు ఉండదని, భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మునుగోడు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
🏠 Home