🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 8:02 am Posted by : Nagilla Rajinikanth

25 గ్రామ పంచాయతీలున్నా.. పిల్లల ప్రజావాణికి స్పందన కరువు!

News Image
అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
పాఠశాలల్లో సమస్యలున్నా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని విద్యార్థులు

భీమదేవరపల్లి, నవంబర్‌ 16 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు ఇతర సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థులకు పిల్లల ప్రజావాణి కార్యక్రమం గురించి తగిన అవగాహన కల్పించకపోవడమే స్పందన తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ దాని ఉద్దేశం, ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎక్కడ సమర్పించాలి అనే విషయాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో సమాచారం అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు కూడా కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించడంలో చొరవ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు తదితర మౌలిక వసతుల సమస్యలు ఎదురవుతున్నా వాటిని నిర్భయంగా అధికారులకు తెలియజేసే వేదికగా పిల్లల ప్రజావాణిని వినియోగించుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు ఈ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

అధికారులు పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు ప్రతి పాఠశాలలో పిల్లల ప్రజావాణిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఈ కార్యక్రమం లక్ష్యం నెరవేరి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
🏠 Home