🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 7:52 am Posted by : Marelli kiran

హనుమకొండ జిల్లాలో ఈ నెల 22న పల్స్ పోలియో.. 84,654 మంది చిన్నారులకు చుక్కలు

News Image
హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించేలా వైద్య, ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లు, లక్ష్యాలు, కార్యాచరణపై సమీక్షించారు.

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 84,654 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 497 పోలియో బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణాల్లో ఉండే చిన్నారులకు కూడా టీకా అందించేందుకు మరో 12 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 22న నిర్వహించే కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించేందుకు 23, 24 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ సర్వే ద్వారా మిగిలిపోయిన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
🏠 Home