🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 8:24 pm Posted by : Praja Nestham Jwala News

రెవెన్యూ ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించాలి: లచ్చిరెడ్డి

News Image
హైదరాబాద్, నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు అన్ని స్థాయిల్లో పదోన్నతులు కల్పించడంతో పాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ), సీసీఎల్ఏ లోకేష్‌కుమార్‌కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 అదనపు కలెక్టర్ల పోస్టులను డిప్యూటీ కలెక్టర్లతో భర్తీ చేయాలని, 85 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. సీనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ తహశీల్దార్లుగా, డిప్యూటీ తహశీల్దార్ల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

జీఓ నం.81కు ముందు మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 61 ఏళ్లు నిండిన వీఆర్ఏలకు న్యాయం చేయడంతో పాటు, భూ సర్వేకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయాలని కోరారు. రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న జీపీఓలకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించి, వారిని సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగుల విధుల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని మీప్రామాణం యాప్ ద్వారా నిర్దేశిత సమయాల్లో హాజరు నమోదు చేసే నిబంధనపై పునరాలోచించాలని లచ్చిరెడ్డి కోరారు. క్షేత్రస్థాయి విధులు, ప్రోటోకాల్, సాధారణ పరిపాలనా బాధ్యతల కారణంగా ఉదయం 10.30 గంటలకు హాజరు, సాయంత్రం 5 గంటలకు ముగింపు నమోదు చేయడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి. భిక్షం, తెలంగాణ గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు పాల్గొన్నారు.
🏠 Home