🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 8:14 pm Posted by : Praja Nestham Jwala News

క్రమశిక్షణే జపాన్ విద్యావిధానంలో ప్రధాన లక్ష్యం

News Image
విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యం.. పరిశోధనలు, ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట

నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): జపాన్‌లో విద్యావిధానం ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. విద్యార్థుల సమగ్ర అభ్యున్నతిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అక్కడి విద్యావ్యవస్థ రూపొందించారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలతో పాటు తోటి విద్యార్థులను గౌరవించేలా వారిని తీర్చిదిద్దుతారు. అక్కడి విద్యావిధానంలో పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ప్రయోగాత్మక బోధనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులు స్వయంగా ఆలోచించి, ప్రశ్నించి, కొత్త విషయాలను అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. ఉన్నత తరగతుల్లోకి వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యకు అనుసంధానిస్తుంది.

జపాన్ పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని కూడా నేర్పిస్తారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను విద్యార్థులే తీసుకుంటారు. దీనివల్ల చిన్నతనం నుంచే శ్రమకు గౌరవం ఇవ్వడం, సామూహిక బాధ్యతను పంచుకోవడం అలవడుతుంది. అంతేకాకుండా శారీరక, మానసిక వికాసం కోసం క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి ప్రవర్తన, అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తారు. జపాన్ విద్యావిధానంలోని ఈ అంశాలు విద్యార్థులను కేవలం మంచి మార్కులు సాధించేలా కాకుండా బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో దోహదపడుతున్నాయి.
🏠 Home