🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:27 pm Posted by : Nagilla Rajinikanth

ఈర్ష్య… ఇదేనా మానవత్వం?

News Image
ఈర్ష్య మనిషిని ఎదగనివ్వదు…
ఇతరులు ఎదుగుతుంటే చూసి ఆనందించనివ్వదు!

ఒకరి అభ్యున్నతికి చేయూతనివ్వలేం…
వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటే
ఆ అడుగులను అడ్డుకోవాలని చూస్తాం!

మనం ఎదగకపోయినా పర్వాలేదు…
కానీ మరొకరు ఎదగడం మాత్రం సహించలేం.
మన జీవితంలో వెలుగులు నిండకపోయినా ఫర్వాలేదు…
పక్కవారి ఇంట దీపం వెలిగితే
ఆ వెలుగును సైతం ఆర్పేయాలనుకుంటాం!

మనం పస్తులున్నా పరవాలేదు…
కానీ మరొకరు మూడు పూటలా తృప్తిగా భోజనం చేస్తుంటే
మనసు మాత్రం అసూయతో రగిలిపోతుంది!

వారి ఆనందంలో ఆనందాన్ని వెతకలేం…
వారి విజయాన్ని మన విజయంలా భావించలేం…
వారి అభివృద్ధిని చూసి స్ఫూర్తి పొందలేం…
పైగా, వారిని వెనక్కి లాగేందుకు
వెయ్యి కారణాలను వెతుకుతాం!

ఎంత విచిత్రమైన మనస్తత్వం ఇది?
ఎంతటి సంకుచితమైన ఆలోచనా ధోరణి ఇది?

తోటి మనిషి కన్నీటిని తుడవలేని చేతులు…
అతని సంతోషాన్ని చూసి చప్పట్లు కొట్టలేని మనసులు…
మరొకరి ఎదుగుదలను మనస్ఫూర్తిగా అభినందించలేని మనుషులు…

చెప్పండి…
ఇదేనా మానవత్వం?
ఇదేనా మనిషిగా మనం సాధించిన సంస్కారం?

గుర్తుంచుకోండి
ఇతరుల ఎదుగుదలను అడ్డుకోవడం వల్ల మనం ఉన్నతులం కాలేం.
వారి విజయాన్ని అభినందించడం వల్ల మన విలువ తగ్గదు.
ఎదుటివారి ఎదుగుదలకు చేయూతనిచ్చినప్పుడే
మనిషిలోని నిజమైన మనిషితనం వెలుగులోకి వస్తుంది!

- వేకువ

తాళ్లపల్లి సురేందర్..
🏠 Home