🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:17 pm Posted by : Praja Nestham Jwala News

దళిత హక్కుల పోరాట సమితి 20వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

News Image

సూర్యాపేట, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): దళిత హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన, సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న 20వ వార్షికోత్సవాలను ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే. ఏసురత్నం తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్‌లో వార్షికోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో నేటికీ కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు కొనసాగడం ఆందోళనకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు, విద్య, ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దళితులు, బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులు, వివక్షకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రెండు దశాబ్దాలుగా సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యమై సామాజిక న్యాయ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు.

ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే 20వ వార్షికోత్సవాల్లో ప్రజాస్వామికవాదులు, యువత, విద్యార్థులు, కార్మికులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కందుకూరి యాదగిరి, సంఘం నాయకులు నెమ్మాది గురుస్వామి, ఉరుసు మహేష్, యాతాకుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home