🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:16 pm Posted by : Praja Nestham Jwala News

పిల్లలు తమ మనసులో మాటను తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పాలి

News Image
నేటి తరం పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టిన ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రం

సూర్యాపేట, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థుల మనస్తత్వాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకొని వారితో స్నేహపూర్వకంగా మెలగాలని మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు త్రివేణి హరి, సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు సూచించారు. పిల్లలకు ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినప్పుడు మందలించకుండా, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఆయన కుమారుడు జయంత్ హీరోగా, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నిర్మించిన ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని శనివారం సూర్యాపేటలోని తిరుమల మల్టీప్లెక్స్‌లో ప్రముఖులు వీక్షించారు. అనంతరం మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువు విషయంలో ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధైర్యంగా చెప్పాలని సూచించారు. పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారిని మందలించకుండా స్నేహితుల్లా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు, గురువులకు హితవు పలికారు. ఎక్కువ మార్కులు వస్తే అతిగా మెచ్చుకోవడం, తక్కువ మార్కులు వస్తే చులకనగా చూడటం సరికాదని, పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులంటే భయపడి వాస్తవాలను దాచిపెట్టకుండా నిజాయితీగా తమ సమస్యలను వెల్లడించేలా పిల్లల్లో ధైర్యం నింపాలన్నారు.

ఈ చిత్రంలో జయంత్ తన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉన్నది ఉన్నట్లు చెబుతూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు. నేటి తరం పిల్లల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్థి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిత్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఉత్తమ అవార్డుతో సత్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం చంద్రశేఖర్, పాఠశాలల కరస్పాండెంట్లు మారం లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పులుసు వెంకటేశ్వర్లు, పగడాల ఉపేందర్ రెడ్డి, కొండ సంతోష్, ఖమ్మంపాటి భిక్షపతి, పట్టణ పెరిక సంఘం అధ్యక్షుడు పత్తిపాక వేణుధర్, సీనియర్ నాయకులు బొలిశెట్టి మధు, బాల్తు శ్రీనివాస్, దొంగరి నాగేశ్వరరావు, పోతురాజు నర్సయ్య, సంద్యాల వినోద్, బందు వీరయ్య, సోమిశెట్టి లింగయ్య, బెక్కం వెంకటేశ్వర్లు, పత్తిపాక వెంకటేశ్వర్లు, పత్తిపాక రాధాకృష్ణ, బుస్సా వీరయ్య, నెమ్మని నాగేశ్వరరావు, బాసాని వెంకన్న, నెమ్మని వెంకటేశ్వర్లు, యర్రంశెట్టి ఉసేందర్, నట్టె కిరణ్, దేవరగట్ల సతీష్, నట్టె కోటేశ్వరరావు, మార్త వెంకటేశ్వర్లు, పత్తిపాక వీరమ్మ, బందు మమత, సౌమ్య తదితరులు, చిత్ర అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home