🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 7:31 pm Posted by : Nagaraju Golla

పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమి కేటాయింపు.. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పాలాభిషేకం

News Image
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా డైరీ దోహదపడుతుంది: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

దామెర, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దామెర మండల కేంద్రంలో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం డైరీ ప్లాంట్ ఆవరణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో డైరీ ప్లాంట్ వద్దకు చేరుకుని ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. 10 ఎకరాల భూమి కేటాయింపుతో మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీకి అభివృద్ధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం ద్వారా తమ ఆనందాన్ని చాటుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళల కోసం.. మహిళలతో ఏర్పాటైన పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమిని కేటాయించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ భూమి కేటాయింపుతో డైరీకి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందని, పాల ఉత్పత్తి, సేకరణ, ఇతర అనుబంధ కార్యకలాపాలు విస్తరించేందుకు దోహదపడుతుందని వివరించారు. తద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.

మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా ఆదాయం సంపాదిస్తూ కుటుంబ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే పరకాల ఇందిరా మహిళా డైరీకి 10 ఎకరాల భూమి కేటాయింపు సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ మహిళల తరఫున ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ డైరీ ఒక వేదికగా నిలవాలని, మహిళలందరూ ఐక్యంగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఇందిరా మహిళా డైరీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, దామెర మండల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home