భూపాలపల్లిలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం అందజేసిన VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్
భూపాలపల్లి, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్–స్టడీ సర్కిల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన కరపత్రాన్ని కూడా ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర బహుజన పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నాణ్యమైన ఉచిత కోచింగ్ సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందలేక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కోచింగ్ సెంటర్–స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తే పేద విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్, గ్రంథాలయ సౌకర్యం, ప్రశాంతమైన అధ్యయన వాతావరణం అందుబాటులోకి వస్తాయని వివరించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని విశ్వసించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందిస్తూ విద్యార్థుల సమస్యలను పరిశీలించి, అంబేద్కర్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు అంబాల అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు VCK యూత్ నాయకులు, విద్యార్థి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో VCK యూత్, విద్యార్థి నాయకులు జీడి జితేందర్, బూడిద నాగరాజు, భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు.