అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలి
నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలోని అన్ని శాఖల పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. చేపడుతున్న పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు నమోదుకు ముఖ గుర్తింపు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణ అవకాశాలు కల్పించి, వారిలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని అన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతులు, విద్యుత్ లైన్ల మార్పిడి వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రహదారి పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని, మరో 2,500 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.