🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:42 pm Posted by : Praja Nestham Jwala News

ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

News Image


చదువు మధ్యలో మానేయకుండా లక్ష్యంతో ముందుకు సాగాలి.. విద్యార్థులకు వ్యవసాయ విద్యార్థినుల సూచన

కీతవారిగూడెం, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు పదో తరగతి తర్వాత ఉన్నత విద్యలో సరైన కోర్సులను ఎంచుకుని తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థినులు సూచించారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ వ్యవసాయ శాస్త్రం చివరి సంవత్సరం విద్యార్థినులు కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కల్పించారు.

పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎంచుకోగల వివిధ కోర్సులు, విద్యా మార్గాలు, ఉద్యోగ అవకాశాలను వివరించారు. వ్యవసాయం, వైద్యం, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌, ఉపాధ్యాయ విద్య తదితర రంగాల్లో ఉన్నత విద్య అభ్యసించడం ద్వారా లభించే అవకాశాలను తెలియజేశారు. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, ఇతర కారణాలతో విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేయకుండా ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఉన్నత విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపారు. చిన్న వయస్సు నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదవాలని విద్యార్థులకు సూచించారు. విద్య ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి కూడా దోహదపడుతుందని వివరించారు. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ, పాఠశాల ఇన్‌చార్జి ఏ. వెంకట ప్రసాద్‌, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. విద్యార్థుల్లో ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెంపొందించడం, మధ్యలో చదువు మానివేసే పరిస్థితులను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
🏠 Home