🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:36 pm Posted by : Praja Nestham Jwala News

వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

News Image


వృద్ధాప్యంలో భరోసా, ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు – జిల్లా సంక్షేమ శాఖ అధికారి కందిబండ నరసింహారావు

సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించడంతో పాటు వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పలు చర్యలు చేపడుతోందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి కందిబండ నరసింహారావు తెలిపారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సయోధ్య డేకేర్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

వృద్ధులకు పింఛన్లు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వయోవృద్ధుల హక్కులకు రక్షణ కల్పించి, వారి జీవితాలకు భద్రత కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం–2007” ప్రకారం వయోవృద్ధుల హక్కులు, పోషణ, సంరక్షణకు చట్టపరమైన రక్షణ కల్పించబడిందని వివరించారు. ఈ చట్టానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. సయోధ్య డేకేర్ సెంటర్ ఇన్‌చార్జి, కవి, గాయకుడు గొడ్డలి నరసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు ఇరిగి కోటేశ్వరి మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం సమాజ సంస్కారానికి నిదర్శనమన్నారు. పిల్లల పెంపకంలో చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలని సూచించారు. వృద్ధులు తమ జీవితానుభవాలతో సమాజానికి విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తారని, వారిని గౌరవించి ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.

సయోధ్య డేకేర్ సెంటర్ వ్యవస్థాపక చైర్మన్ సుమబాల మాట్లాడుతూ.. కన్నవారిని కాపాడుకోవడం కన్నబిడ్డల బాధ్యతని, వృద్ధులను ఆదరించడం సమాజ ధర్మమని అన్నారు. జీవితాంతం కుటుంబం కోసం శ్రమించిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఆప్యాయత, ఆదరణకు దూరం కావడం బాధాకరమన్నారు. వారికి కన్నీరు కాకుండా ప్రేమాభిమానాలు, ఆత్మీయతను అందించాలని కోరారు. వృద్ధుల జీవితాలకు భరోసా కల్పించేందుకు సయోధ్య కేంద్రం తన వంతు కృషి చేస్తోందని తెలిపారు.

వృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, కవి, రచయిత అమిద్ ఖాన్ మాట్లాడుతూ.. వృద్ధులకు ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వారి సమగ్ర సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ.. వృద్ధులకు కావాల్సింది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, ప్రేమతో కూడిన కుటుంబ ఆదరణ కూడా అవసరమని అన్నారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని, వారికి అండగా నిలవడం ప్రతి సంతానం బాధ్యతని పేర్కొన్నారు. వృద్ధులు తమ అనుభవాలతో కుటుంబాలను తీర్చిదిద్దే మార్గదర్శకులని, వారి సంక్షేమం దేశ అభ్యున్నతికి కూడా ఒక కొలమానమని వివరించారు. ఆధునిక సమాజంలో ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో మానవ సంబంధాలు, ఆత్మీయత, అనురాగం, నైతిక విలువలను కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల కృష్ణారెడ్డి, కార్యదర్శులు యాదగిరి, మద్ది ఉపేందర్ రెడ్డి, సయోధ్య సెంటర్ మేనేజర్ సూరం రేణుక తదితరులు ప్రసంగించారు. గొడ్డలి నరసన్న ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. సయోధ్య డేకేర్ సెంటర్‌లో సహజంగా లభించే ఆకులతో వృద్ధులు విస్తరాకులు తయారు చేస్తున్నారని నరసన్న తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహజ సిద్ధమైన విస్తరాకులను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సన్మానించారు. దాతలు జాన్ సుందర్, రాము, సంతోష్, రవి తదితరుల సహకారంతో కార్యక్రమానికి హాజరైన వారికి భోజన వసతి కల్పించారు.
🏠 Home