మల్లారంలో పారిశుద్ధ్య సమస్య.. పట్టించుకునేదెవరు?
చెత్త తొలగింపులో జాప్యంపై గ్రామస్థుల అసంతృప్తి.. కార్మికుల విధుల నిర్వహణపై ఫిర్యాదులు
భీమదేవరపల్లి, ప్రజానేస్తం జ్వాల: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై గ్రామ పంచాయతీ అధికారులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నారు. గత బుధవారం సాయంత్రం గ్రామంలో వారసంత నిర్వహించారు. సంత ముగిసిన తర్వాత కూరగాయల వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో రహదారులపై చెత్త పేరుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? వారికి కేటాయించిన పనులు సక్రమంగా జరుగుతున్నాయా? అనే అంశాలపై పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడుతున్నారు. కొందరు కార్మికులతో పారిశుద్ధ్య పనులకు బదులుగా ఇతర పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను పరిశీలించాల్సి ఉంది.
ముఖ్యంగా బస్టాండ్ ఆవరణలో చెత్త పేరుకుపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలోని సమస్యలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, చెత్త తొలగింపుతో పాటు కార్మికుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.