🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:16 pm Posted by : Praja Nestham Jwala News

లక్ష ఎకరాల్లో పంటల మార్పిడికి సన్నాహాలు!

News Image
రైతులకు మేలు చేసే పంటల సాగుపై జిల్లా యంత్రాంగం దృష్టి

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ వచ్చే పంటలపై అవగాహన

విజయవంతమైన రైతుల అనుభవాలతో ప్రత్యేక యూట్యూబ్ ఛానల్

సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): రైతులు ఒకే రకమైన పంటలు కాకుండా, భూమికి అనువైన ఇతర పంటలను కూడా సాగు చేసేలా ప్రోత్సహించేందుకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే యాసంగి (2026–27) సీజన్‌లో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటల మార్పిడి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ఏ పంట వేస్తే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి, మెరుగైన ఆదాయం వస్తుందనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏ ప్రాంతంలో ఏ పంట బాగా పండుతుంది, నీటి సౌకర్యం ఎలా ఉంది, సాగుకు ఎంత ఖర్చవుతుంది, పండిన పంటకు మార్కెట్‌లో గిరాకీ ఉందా అనే విషయాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో సాగుకు అనువైన పంటలను గుర్తించి ప్రణాళికలు రూపొందించనున్నారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు కలిసి పనిచేస్తూ రైతులకు అందుబాటులో ఉన్న సాగునీటి, సూక్ష్మ సేద్య పథకాల ప్రయోజనాలను వివరించనున్నారు. ఏ పంటకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది? ఎంత దిగుబడి, ఆదాయం పొందవచ్చు? అనే వివరాలతో పంటల జాబితా తయారుచేసి రైతులకు పుస్తక రూపంలో అందించనున్నారు.

రైతుల వద్దకే వెళ్లి వివరించాలి
పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటించాలని కలెక్టర్ సూచించారు. కేవలం సమావేశాలు పెట్టడం, వాట్సాప్‌లో సందేశాలు పంపడంతో సరిపెట్టకుండా రైతులను నేరుగా కలిసి మాట్లాడాలని తెలిపారు. గతంలో సూచించినట్లుగా ప్రతి అధికారి కనీసం పది మంది రైతులను కలిసి కొత్త పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని పేర్కొన్నారు. నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహించి పంటల మార్పిడిపై రైతుల్లో ఆసక్తి పెంచనున్నారు. ఇందుకోసం వ్యవసాయ, ఉద్యానవన శాఖల సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. పత్రికలు, టీవీలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కూడా రైతులకు సమాచారం అందించనున్నారు.

విజయవంతమైన రైతుల కథలతో ప్రత్యేక ఛానల్
ఇప్పటికే కొత్త పంటలు సాగుచేసి మంచి లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను ఇతర రైతులకు తెలియజేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి వ్యవసాయ క్లస్టర్ నుంచి ఇద్దరు నుంచి ఐదుగురు విజయవంతమైన రైతులను గుర్తించి, వారు ఏ పంట వేశారు? ఎంత ఖర్చు చేశారు? ఎంత దిగుబడి వచ్చింది? ఎంత ఆదాయం పొందారు? అనే వివరాలను సేకరించనున్నారు. ఈ రైతుల అనుభవాలను వీడియోలుగా రూపొందించి ప్రత్యేక యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇతర రైతులు కూడా వాటిని చూసి కొత్త పంటల సాగుపై అవగాహన పెంచుకునేలా వాట్సాప్ ద్వారా ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజుల్లో ఛానల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యార్థుల యూనిఫామ్‌ల పంపిణీపై సమీక్ష
వ్యవసాయ అంశాలతో పాటు జిల్లాలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపైనా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, ఇంటర్మీడియట్, కళాశాలలు, పాలిటెక్నిక్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే మంగళవారం ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ల విషయంలో కొలతలు సరిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. చిన్న పిల్లలకు పెద్ద సైజు, పెద్ద పిల్లలకు చిన్న సైజు దుస్తులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు వస్తాయని, ఈ సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. యూనిఫామ్‌ల కుట్టు, సరఫరా, పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారులు కలిసి పరిష్కరించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను కూడా పరిశీలించనున్నారు. ప్రతి శాఖ అధికారి వారానికి ఒకసారి తమ పరిధిలోని పనులను సమీక్షించి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

పశుసంవర్ధక శాఖపైనా దృష్టి
పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పనులపై కూడా సమావేశంలో చర్చించారు. జంతువుల సంరక్షణ కేంద్రానికి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజు, డీఆర్డీఓ సన్యాసయ్య, సీఏఫ్ఓ దామోదర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి యాదగిరి, డీఐఈఓ సులోచన రాణి, డీబీసీడీఓ విశాల్, డీఎస్సీడీఓ లత, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్, ఇంట్రా ఈఈ శ్రీనివాసరావు, జీఎం ఇండస్ట్రీస్ భారతి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home