🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 3:31 pm Posted by : Nagaraju Golla

గణేష్ చౌక్ అగ్నిప్రమాద బాధితులకు న్యాయం చేయాలి.. లేకుంటే ప్రజా ఉద్యమం

News Image


ఐదు దుకాణాలు దగ్ధం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం
బాధితులకు తక్షణ పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని రవి పటేల్ డిమాండ్

జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ రోడ్డుపై ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు ఫుట్‌పాత్ దుకాణాలు పూర్తిగా దగ్ధమై, సుమారు రూ.12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

గురువారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన బాధిత దుకాణ యజమానులను పరామర్శించి, నష్ట వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి విపత్తు సహాయ నిబంధనల ప్రకారం అర్హులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. నిధులు అందుబాటులో లేవని అధికారులు తెలిపినట్లు రవి పటేల్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులు కేటాయించి బాధిత ఐదు కుటుంబాలను ఆదుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే ఒక్కో దుకాణానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.

గతంలో రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు, దుకాణాల నిర్మాణానికి సహాయం చేస్తామని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని రవి పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. అటవీ శాఖ పరిధిలోని స్థల సమస్యను కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పరిష్కరించి, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని దుకాణాలు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు డీఎఫ్ఓతోనూ ఫోన్‌లో మాట్లాడి బాధితులకు చట్టపరమైన పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు. అధికారులు స్పందించకపోతే బాధితులతో కలిసి ఆందోళనలు చేపడతామని, న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, అధికార ప్రతినిధి మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, చంద్రశేఖర్, లక్ష్మణ్, ప్రసాద్, రామ్ చరణ్, బాధిత దుకాణ యజమానులు, స్థానికులు పాల్గొన్నారు.
🏠 Home