🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 11:53 am Posted by : Praja Nestham Jwala News

దూదేకుల సమాజ అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

News Image

యువతకు సబ్సిడీ రుణాలు, విద్యా–ఉపాధి అవకాశాలు కల్పించాలి

తెలంగాణ ముస్లిం దూదేకుల సంఘం యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పాషా డిమాండ్

గరిడేపల్లి, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడిన దూదేకుల (పింజారి, నూబాఫ్, లడఫ్) ముస్లిం మైనారిటీ ఉపకులాల అభ్యున్నతికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ పాషా డిమాండ్ చేశారు.

చారిత్రకంగా, సాంస్కృతికంగా సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన దూదేకుల సమాజం నేటికీ అనేక ప్రాంతాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, దూదేకుల వర్గాలకు తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు.

ఈ నేపథ్యంలో దూదేకుల, పింజారి, నూబాఫ్, లడఫ్ వర్గాల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు భారీ సబ్సిడీతో రుణాలు అందించాలని, పేద విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్యతో పాటు ఉన్నత విద్య, విదేశీ విద్య అభ్యసించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే చట్టసభలు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో దూదేకుల సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా కూడా ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి ప్రత్యేక దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని షేక్ పాషా విజ్ఞప్తి చేశారు.
🏠 Home