🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 11:38 am Posted by : Praja Nestham Jwala News

రైతులకు శుభవార్త.. ఇక స్థానికంగానే ధాన్యం విక్రయాలు

News Image

కీతవారిగూడెంలోనే మిర్యాలగూడ మార్కెట్ ధర.. రవాణా ఖర్చులకు విముక్తి


ట్రాక్టర్ల కోసం గంటల తరబడి నిరీక్షణకు చెక్‌.. 10–15 నిమిషాల్లోనే అన్‌లోడింగ్‌


కీతవారిగూడెం, ప్రజానేస్తం జ్వాల : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులకు కొంత ఉపశమనం కలగనుంది. ధాన్యం విక్రయాల కోసం మిర్యాలగూడ, హుజూర్‌నగర్ మార్కెట్లకు వెళ్లి రవాణా ఖర్చులు భరించడంతో పాటు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితికి ప్రత్యామ్నాయంగా కీతవారిగూడెం సమీపంలోనే ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు.

సర్వారం రోడ్డులోని శ్రీ శ్రీనివాస స్టోన్ క్రషర్ మిల్లులో నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.** మిర్యాలగూడ మార్కెట్ ధరల ప్రకారం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సన్న రకం ధాన్యం (సింట్లు నంబర్‌-1) క్వింటాల్‌కు రూ.3,900 నుంచి రూ.4,000 వరకు ధర లభించే అవకాశం ఉందని తెలిపారు.

రైతులకు రవాణా భారం తగ్గింపు.. సమయం ఆదా!

దూరప్రాంత మార్కెట్లకు ధాన్యం తరలించాలంటే ట్రాక్టర్ కిరాయి, డీజిల్ ఖర్చులు రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి. అక్కడికి చేరుకున్న తర్వాత ధాన్యం దిగుమతి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్థానికంగానే ధాన్యం కొనుగోలు సదుపాయం కల్పిస్తున్నట్లు మిల్లు నిర్వాహకులు తెలిపారు.

మిల్లుకు ధాన్యం తీసుకొచ్చిన ట్రాక్టర్లను కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే అన్‌లోడింగ్ చేసి పంపించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా కానుంది.

స్థానిక రైతులకు అందుబాటులో మరో అవకాశం!

కీతవారిగూడెం, సర్వారం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. పంట అమ్మకాల్లో రైతులకు ఇబ్బందులు తగ్గించి, స్థానికంగానే ధాన్యం విక్రయించుకునే వెసులుబాటు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
🏠 Home