ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి
ప్రతి గ్రామంలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీకి ఉపాధి అవకాశాలు కల్పించాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఆత్మకూరు: రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వనరులను సంరక్షిస్తూ, ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందేలా చూడాలని సూచించారు.
ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, వీబీ-జీ రామ్ జీ పథకం అమలు, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి వనరులను పరిరక్షించాలని, బావుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో భూగర్భ జలమట్టాన్ని తప్పనిసరిగా పరిశీలించి సంబంధిత నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీకి ఉపాధి కల్పించాలి
వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా అవగాహన కల్పించి, పనుల్లో భాగస్వాములను చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. నీటిని వృథా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి నిబంధనల మేరకు రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంచినీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల జీవనాధారం వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం సరికాదని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి సమస్యల పరిష్కారానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
భూగర్భ జలాల సంరక్షణ, నీటి పొదుపు, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.