🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 7:38 pm Posted by : Praja Nestham Jwala News

త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

News Image


హైదరాబాద్‌లో ప్రక్రియ పూర్తికాగానే జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపు

హైదరాబాద్‌, నవంబర్‌ 11 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన పలు తీర్మానాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల చేసిన సానుకూల ప్రకటనలపై సంఘ కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపినట్లు నాయకులు వివరించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసి జర్నలిస్టుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్లు మంత్రికి తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టుల మరో ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై కూడా సంఘం చేసిన తీర్మానాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వినతిపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముందుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలోనే వారికి ఇళ్ల స్థలాలు అందిస్తామని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్ పాల్గొన్నారు.
🏠 Home