హనుమకొండ కలెక్టరేట్‌లో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు.. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు
హనుమకొండ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల):
జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యా వ్యవస్థ ఆధునీకరణకు, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కొనియాడారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.