🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 7:16 pm Posted by : Praja Nestham Jwala News

విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి

News Image


హుజూర్‌నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): ఆధునిక భారత విద్యారంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ స్థానిక గ్రంథాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ బచ్చు రామారావు, మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య, విజిలెన్స్ కమిటీ సభ్యులు గల్లా వెంకటేశ్వర్లు, పోతుల జ్ఞానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించారని పేర్కొన్నారు. 1888 నవంబర్ 11న మక్కాలో జన్మించిన ఆయన, 1947 నుంచి 1958 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. దేశంలో ఆధునిక విద్యావ్యవస్థ అభివృద్ధికి, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల అభివృద్ధితో పాటు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థల ఏర్పాటుకు ఆయన కృషి చేశారని వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయవాదిగా దేశానికి సేవలందించారని, భారత విభజనను వ్యతిరేకించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారం లభించిందని పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలోనూ ఆజాద్ రచనలు, విద్యపై ఆయన ఆలోచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో విద్య ప్రాముఖ్యతపై సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు ఎస్.కె. మన్సూర్ అలీ, గంజి శివ, మజీద్ భాయ్, బిక్కన్ సాబ్, ముషం సత్యనారాయణ, సైదులు నాయక్, కోలపూడి యోహాన్, కస్తాల దిల్, గొట్టిముక్కుల రాములు, ఎస్.డి. ఆశ్రఫ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, మేళ్లచెరువు ముక్కంటి, నాగేందర్, చింతకాయల రాము, ఎస్. రఫీ, భార్గవ్, నవీన్, వినోద్, మధు, క్రాంతి, సాయి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home