🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 7:56 am Posted by : Marelli kiran

సమాచార హక్కు చట్టానికి తూట్లు. ములుగు జిల్లాలో బరితెగించిన యంత్రాంగం! సుమారు 2 నెలల గడువు దాటింది.. ఫస్ట్ అప్పీల్ ఆర్డర్ ఇచ్చినా లెక్కచేయని అధికారులు! "మేము డాక్యుమెంట్స్ ఇవ్వలేము, మీరే ఆఫీస్‌కి వచ్చి చెక్ చేసుకోండి" అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం

News Image
వెంకటాపూర్, (ప్రజానేస్తం జ్వాల):
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు మూలస్తంభమైన సమాచార హక్కు చట్టం (RTI Act 2005) కు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో తీవ్ర విఘాతం కలుగుతోంది. చట్టం నిర్దేశించిన 30 రోజుల గడువు ముగిసినా సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసిన అధికారులు, చివరకు ప్రథమ అప్పీల్ అథారిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా పెడచెవన పెడుతున్నారు. ఉన్నతాధికారిచ్చిన ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా, రికార్డులను ఇవ్వలేమని చెబుతూ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
1. అసలు ఏం జరిగింది? - ఆర్టీఐ దరఖాస్తు మరియు అప్పీలు వివరాలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి 2022-23 నుండి 2024-25 వరకు చేపట్టిన పనులు, వ్యయాలు, రికార్డులు, తీర్మానాలు మరియు ఉపాధి హామీ (MGNREGS) పనులకు సంబంధించి మొత్తం 14 అంశాలతో కూడిన సమగ్ర దరఖాస్తును సమాచార హక్కు చట్టం కింద RTI సాధన కమిటీ ములుగు జిల్లా ఉప అధ్యక్షుడు చిన్నపుండ్రా ప్రసాద్ రెడ్డి వెంకటాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించారు (తేదీ: 11/09/2026, IPO నం: 61F 027628).
కానీ, చట్టబద్ధమైన 30 రోజుల టైమ్ లైన్ దాటినప్పటికీ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోగా, నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయల ఫీజు చెల్లించాలని అవాస్తవ లెక్కలతో డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు సెక్షన్ 19(1) ప్రకారం ప్రథమ అప్పీలు దాఖలు చేశారు.
2. ఎంపీడీవో ఉత్తర్వులకే దిక్కులేదు!
ఫస్ట్ అప్పీల్ లో 7 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించినా.. స్పందించని యంత్రాంగం
ఈ ప్రథమ అప్పీలుపై విచారణ జరిపిన ప్రథమ అప్పీలేట్ అధికారి / మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), వెంకటాపూర్ వారు తేదీ: 26-10-2026 నాడు స్పష్టమైన మొదటి హియరింగ్ నివేదిక / ఉత్తర్వులు జారీ చేశారు. కోరిన సమాచారాన్ని ఉచితంగా (Free of Cost) ఏడు రోజుల్లోగా సాఫ్ట్ కాపీ రూపంలో (పెన్ డ్రైవ్ లో) అందించాలని, ఇక ముందు పొరపాట్లు చేయవద్దని స్పష్టంగా ఆదేశించారు.
కానీ, ప్రథమ అప్పీల్ లో ఇచ్చిన ఆ ఆర్డర్‌ను సైతం క్షేత్రస్థాయిలో బుట్టదాఖలు చేశారు. "మేము డాక్యుమెంట్స్ ఇవ్వలేము.. మీరే నేరుగా ఆఫీసుకు వచ్చి చెక్ చేసుకోండి" అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇస్తున్నారు. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా, వాటిని అమలు చేయడంలో కార్యాలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఈ నిర్లక్ష్య వైఖరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైంది.
3. ఎంపీవో బేఖాతరు ధోరణి!
చట్టాన్ని కాలరాస్తూ సమాచారాన్ని దాటవేస్తున్న వైనం.. ప్రశ్నిస్తే మొండిఘటంలా వ్యవహారం
మరోవైపు మండల పంచాయతీ ఆఫీసర్ (MPO) తీరు కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఆర్టీఐ చట్టం ప్రకారం పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న అధికారులు, రికార్డులను బయటపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. ఫస్ట్ అప్పీల్ లో ఆర్డర్స్ వచ్చినా సరే, వాటిని అమలు చేసేందుకు కనీస చొరవ చూపడం లేదు.
కాలయాపన చేస్తూ, బాధ్యతల నుండి తప్పుకుంటూ దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. ఆర్టీఐ చట్టాన్ని నీరుగారుస్తున్న ఈ తీరుపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి, బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని.. చట్టప్రకారం రావాల్సిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా ఇప్పించాలని RTI సాధన కమిటీ ములుగు జిల్లా ఉప అధ్యక్షుడు చిన్నపుండ్రా ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు!
🏠 Home