అనాథ మృతదేహానికి అంత్యక్రియలు.. మానవత్వం చాటుకున్న సర్పంచ్
ముల్కనూర్, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):
మానవత్వమే మిన్న అని నిరూపించారు ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీప బస్టాప్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు.
మృతుడికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరిపించి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డిపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.