సెల్ఫోన్లకు దూరంగా ఉండి.. క్రీడల వైపు అడుగులు వేయాలి
నల్గొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులు సెల్ఫోన్ల వినియోగాన్ని తగ్గించి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో కలెక్టర్ ఎలెవన్, ఎస్పీ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహించిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌ను కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్‌ను వీక్షించారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీలో ఎస్పీ ఎలెవన్ జట్టు 118 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ఫోన్లకే కేటాయిస్తున్నారని, దానికి బదులుగా ఆటలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు అధికారుల మధ్య స్నేహభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులు రూ.1.80 లక్షలతో ఏర్పాటు చేసిన రివర్స్ ఆస్మాసిస్ (ఆర్.ఓ.) నీటి శుద్ధి ప్లాంట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వచ్చిన శుద్ధి తాగునీటి సదుపాయం ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.