🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 3:10 pm Posted by : Praja Nestham Jwala News

యువత మెలుకో...

News Image
యువత
..................

కాలేజీ రోజులంటే
షికార్లకే కాదు...
స్వప్నాలకు రెక్కలు తొడిగే కాలం.

పుకార్ల వెంట పరుగెత్తకండి...
మద్యానికి, గంజాయికి
చెడు వ్యసనాలకు బానిసలై
మీ భవిష్యత్తును బూడిద చేయకండి.

అమ్మా... నాన్నా...
తమ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి,
ఎండనకా... వాననకా...
కాయకష్టం చేస్తూ
మీ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు.

ముదుసలి వయసులో
మీ చేత నాలుగు మెతుకులు తినాలన్నది
వారి ఆశ కాదు...
“మేము పడిన కష్టాలు
మా పిల్లలు పడకూడదు”
అన్నదే వారి తాపత్రయం.

ప్రేమ పేరుతో
కాలాన్ని వృథా చేయకండి...
మీ కలలను కాలగర్భంలో కలపకండి.

పుస్తకాన్ని తోడుగా చేసుకోండి...
జ్ఞానాన్ని ఆయుధంగా మలచుకోండి...
ఉన్నత విద్యను అభ్యసించి
సమాజ మార్పుకు సారథులుగా ఎదగండి.

మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన
సామాజిక చైతన్య మార్గంలో...
పెరియార్ రామస్వామి నాయకర్ నూరిపోసిన
ఆత్మగౌరవ బాటలో...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన
విద్యా–సమానత్వ స్ఫూర్తితో
ముందుకు సాగండి.

మీ చేతుల్లోనే
రేపటి సమాజం ఉంది...
మీ అడుగుల్లోనే
భవిష్యత్తు దిశ ఉంది...

ఈ రోజే పునాది వేయండి...
ఉజ్వల భవిష్యత్తుకు
మీ జీవితాన్నే ఒక విజయగాథగా మలచండి.
వేకువ
...........
తాళ్లపెల్లి సురేందర్
🏠 Home