33 ఫార్మా కంపెనీల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు33 ఫార్మా కంపెనీల కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు
కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలి.. గోసుకొండ వెంకటేష్ డిమాండ్
చౌటుప్పల్, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 33 ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం, పంటలు, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు గోసుకొండ వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం చౌటుప్పల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో 33 ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చినా, కాలుష్య నియంత్రణపై తగిన పర్యవేక్షణ లేదని విమర్శించారు. రాత్రి వేళల్లో రసాయన వ్యర్థాలు విడుదలవుతున్నాయని, దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
చౌటుప్పల్, దండు మల్కాపురం, తాళ్ల సింగారం, దేవలమ్మ నాగారం గ్రామాల్లో బోర్ల నీరు రంగు మారి, దుర్వాసన వస్తోందని, రసాయన కాలుష్యంతో రైతుల వరి, పత్తి పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. చిన్నారులు శ్వాసకోశ, చర్మ సమస్యలతో బాధపడుతున్నారని, వృద్ధులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి 33 కంపెనీలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కంపెనీలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) విధానం అమలు చేయాలని, ప్రభావిత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. చౌటుప్పల్ పరిధిలో కొత్త ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వకూడదని, కాలుష్యంతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వినతిపత్రం అందజేస్తామని, సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గోసుకొండ వెంకటేష్ హెచ్చరించారు.