బాణసంచా దుకాణాల వద్ద భద్రతా లోపాలకు తావివ్వొద్దు!
హుజూర్‌నగర్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): దీపావళి పండుగ నేపథ్యంలో హుజూర్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్న బాణసంచా దుకాణాల వద్ద భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ అధికారులను కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ సతీష్, ఫైర్ ఆఫీసర్ సుబ్బరామిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ యాదగిరికి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణసంచా దుకాణాలకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి చేయాలని, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, నివాసాల మధ్య ఏర్పాటు చేసిన దుకాణాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.
అలాగే నాణ్యతలేని, గడువు ముగిసిన బాణసంచా విక్రయాలను అరికట్టడంతో పాటు నిర్ణీత ధరలకు మించి విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలే తప్ప, అధికారుల నిర్లక్ష్యం లేదా వ్యాపారుల నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలకు కారణం కాకూడదని హరీష్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బెల్లంకొండ నరేష్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కంటు నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి, ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్, కొప్పెర సాయిరాం, చిలక రాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.