🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:37 pm Posted by : Praja Nestham Jwala News

ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి

News Image


సూర్యాపేట, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా జిల్లాల పనితీరును మరింత మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. విద్య, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అభివృద్ధి లక్ష్యాల పురోగతిపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల నిధుల వినియోగాన్ని జనవరి మొదటి వారంలోగా గరిష్ట స్థాయికి, వీలైనంత వరకు 100 శాతానికి చేర్చాలని సీఎస్ సూచించారు. నిధుల సద్వినియోగం ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మరమ్మతు పనులు చేపట్టాలని, అధికారులు తరచూ పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల నాణ్యతతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెంపుపై దృష్టి సారించాలన్నారు.

*తాగునీటి సరఫరాపై ప్రత్యేక నిఘా*

వేసవి కాలం ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి వారం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. నవంబర్ 15లోగా చేతిపంపులు, బోర్లు, బహిరంగ బావులకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయాలని, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

*12 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం*

VBGRAMG పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు సగటున 5.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంటూ, చేపట్టే పనులు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వేగం పెంచాలి*

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా కొత్త లోగోతో స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకోవాలని, సబ్సిడీ ద్వారా వారికి కలిగే ఆర్థిక ప్రయోజనం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులోనూ జిల్లా పనితీరును మెరుగుపరచాలని, చేయూత పింఛన్ల పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ ప్రేమ్ రాజు, సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, డీఐఈఓ సులోచన రాణి, డీఏవో శ్రీధర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, ఇంట్రా ఈఈ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
🏠 Home