🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:36 pm Posted by : Praja Nestham Jwala News

పిల్లల అభిప్రాయాలకు పెద్దపీట.. చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా సూర్యాపేట!

News Image



సూర్యాపేట, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల):

పిల్లల అభిప్రాయాలు, అవసరాలు, సమస్యలను గుర్తించి వారికి సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో సూర్యాపేట జిల్లాను చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల మంది విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో జిల్లాలోని 100 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు గ్రూప్ డిస్కషన్లలో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆలోచనలు, అభిరుచులు, భవిష్యత్తు లక్ష్యాలను పంచుకోవడంతో పాటు పాఠశాలలు, గ్రామాల్లో తమకు సురక్షితంగా అనిపించే ప్రాంతాలు, ఇబ్బందులు ఎదురయ్యే ప్రదేశాలను వివరించారు. పిల్లలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, గ్రామాల్లో ఉండాల్సిన అనుకూల వాతావరణం, ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

*పిల్లల సూచనల ఆధారంగా కార్యాచరణ*

పిల్లల అభిప్రాయాలను గౌరవించి, వారి హక్కులను పరిరక్షించినప్పుడే చైల్డ్ ఫ్రెండ్లీ జిల్లాను నిర్మించడం సాధ్యమవుతుందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమం ద్వారా సేకరించిన అభిప్రాయాలు, సూచనల ఆధారంగా పిల్లల అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శక్తి హబ్, సఖీ కేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సీఆర్‌పీలు, విద్యాశాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home