అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. బోస్టన్‌లో శ్రీజ కోసం గాలింపు
నల్గొండ, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లాకు చెందిన శ్రీజ (23) బోస్టన్‌లో అదృశ్యమైనట్లు సమాచారం. ఏడాది క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఆమె చదువుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది.
నవంబర్ 2వ తేదీ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని బీచ్ ప్రాంతంలో ఆమె సెల్‌ఫోన్ చివరి లొకేషన్ గుర్తించినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు శ్రీజ ఆచూకీ లభించలేదు.
ఒక్కగానొక్క కుమార్తె అదృశ్యమవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శ్రీజ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎదురుచూస్తున్నారు.