ముల్కనూర్ మోడల్ స్కూల్‌లో మూడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు
లైబ్రేరియన్, కంప్యూటర్, యోగా టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా చైర్మన్ ఆధ్వర్యంలోని కాకతీయ ఉద్యోగ వికాస సంస్థ ద్వారా తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు.
వివరాల ప్రకారం.. లైబ్రేరియన్ ఒక పోస్టు, కంప్యూటర్ టీచర్ ఒక పోస్టు, యోగా టీచర్ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులకు లైబ్రేరియన్ పోస్టుకు నెలకు రూ.19,500, కంప్యూటర్, యోగా టీచర్ పోస్టులకు నెలకు రూ.22,750 చొప్పున వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై, 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.