సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలో విద్య, వైద్య మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఐదు అంతస్తుల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతం చేసి రెండు, మూడు నెలల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎస్బీఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌండేషన్ సహకారంతో రూ.1.17 కోట్ల అంచనా వ్యయంతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు. వీటిలో వెంటిలేటర్లు, మైక్రోటోన్, కాటరీ మెషిన్, బ్రోంకోస్కోప్, డెంటల్ చైర్, సీ-ఆర్మ్ తదితర పరికరాలు ఉన్నాయి. అలాగే కాంపెన్సేటరీ అపాయింట్మెంట్ ప్రక్రియలో భాగంగా అర్హులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్–విజయవాడ నాలుగు వరుసల జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించేందుకు అనుమతులు తీసుకొచ్చి త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ఆరో ప్యాకేజీ కింద తుంగతుర్తి నియోజకవర్గానికి రూ.1,000 కోట్లు మంజూరు చేయించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. పాత లిఫ్టుల పునరుద్ధరణతో పాటు కొత్త లిఫ్టుల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందించామని, సుమారు 80 శాతం మంది ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొర్రిశెట్టి నివేదిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్, మాజీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.