🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:29 pm Posted by : Marelli kiran

స్కానింగ్ కేంద్రాల్లో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు తప్పనిసరి

News Image


హనుమకొండ, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిత స్పష్టం చేశారు. చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సంబంధిత కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు హనుమకొండలోని పలు స్కానింగ్ కేంద్రాలను డాక్టర్ రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులు, ఫారమ్-ఎఫ్, స్కానింగ్ యంత్రాలకు సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. చట్ట ప్రకారం అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.

ప్రతి స్కానింగ్ కేంద్రం రోజువారీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. రికార్డుల్లో ఎలాంటి తప్పులు, అసంపూర్ణ వివరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్కానింగ్ సేవలు అందించే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

భ్రూణ లింగ నిర్ధారణను నిరోధించడం, ఆడపిల్లల సంరక్షణకు చట్టపరమైన రక్షణ కల్పించడం పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు, తనిఖీల సమయంలో అవసరమైన రికార్డులు, అనుమతి పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్ రజిత సూచించారు.
🏠 Home